
- భూపతిరెడ్డి
నిజామాబాద్, వెలుగు : మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మహిళాలోకాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు పథకాలను అమలు చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లోని క్యాంప్‌ఆఫీస్‌లో 200 మంది మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో రూ.20 వేల కోట్లను మహిళలకు వడ్డీలేని రుణంగా ఇచ్చి వారిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోందన్నారు.
60 ఏండ్లు దాటిన మహిళలకు కూడా లోన్లు ఇస్తూ ఆర్థికంగా చేయూత కల్పిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ అద్దె బస్సులు, సోలార్విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి మహిళలను వ్యాపారులుగా మారుస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కారుకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, నాయకులు తారాచంద్‌నాయక్, పోలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, ఉమ్మాజీ నరేశ్, నవీన్ గౌడ్, సాయరెడ్డి, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.