బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి మతిభ్రమించింది : బీర్ల ఐలయ్య 

బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి మతిభ్రమించింది : బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మండిపడ్డారు. మంగళవారం యాదగిరిగుట్ట మంగళగిరిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి విచారణల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత మహేశ్వర్ రెడ్డికి లేదన్నారు. ధరణి పేరుతో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఎనలేని పోరాటం చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులను తొలిగించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ వేశామని చెప్పారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా కేవలం పది రోజుల్లోనే రైతు సమస్యలకు సంబంధించిన రెండు లక్షల అప్లికేషన్లను పరిష్కరించామని తెలిపారు.

ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేసి భూమాత పోర్టల్ ను తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్ గౌడ్, జిల్లా నాయకుడు దుంబాల వెంకట్ రెడ్డి, టౌన్ మాజీ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ గౌడ్, కౌన్సిలర్ మల్లేశ్ యాదవ్, నాయకులు భిక్షపతి, వెంకటేశ్, హరీశ్​తదితరులు పాల్గొన్నారు.