నీ ఒక్క ఊరు ఓట్లేయకపోతే నేను ఎమ్మెల్యేగా గెలవలేనా? 

నీ ఒక్క ఊరు ఓట్లేయకపోతే నేను ఎమ్మెల్యేగా గెలవలేనా? 
  • చెప్పినట్లు వినడం లేదని మహిళా సర్పంచ్‌ సస్పెండ్
  • ఆత్మహత్యాయత్నం చేసిన సర్పంచ్
  • నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై వెలిమినేడు సర్పంచ్ ఆరోపణ

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తనను అకారణంగా సస్పెండ్ చేయించారని నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆమెకు మద్దతుగా టీఆర్ఎస్ వార్డ్ మెంబర్లు కూడా ధర్నాలో పాల్గొన్నారు. 

‘గ్రామానికి చుట్టుపక్కల ఉన్న కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేయలేదని నన్ను సస్పెండ్ చేయించారు. ఎమ్మెల్యే గారికి నేను మొదటి నుంచి మద్దతిస్తూనే ఉన్నా. ఆయన చెప్పినట్లు వింటూనే ఉన్నాను. ఫ్లెక్సీలలో కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫోటోలు వేయోద్దని చెప్పాడు. నియోజకవర్గానికి ఆయన బాస్ అయితే గ్రామానికి నేను బాస్. అందరూ నా మాట వినాలని.. నేను ఎమ్మెల్యే మాట విన్నాను. పాలకవర్గం నా మాట వినడంలేదని చెబితే పట్టించుకోవడంలేదు. నీ ఒక్క ఊరు ఓట్లేయకపోతే నేను ఎమ్మెల్యేగా గెలవలేనా అన్నాడు. కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేసి నేనే వాడుకుంటున్నాని అన్నాడు. నాకు చదువు రాదు. నేను ఏ డబ్బులూ వసూలు చేయలేదు. డబ్బులు వసూలు చేస్తే ఉంటవు లేకపోతే సస్పెండ్ అయితవ్ అన్నాడు. డబ్బులు వసూలు చేయలేదని నన్ను సస్పెండ్ చేయించిండు. కేసీఆర్, కేటీఆర్ ఈ వీడియో చూసి నాకు న్యాయం చేయాలి. నేను ఉరేసుకొని చావనైనా చస్తాను కానీ.. ఎక్కడ డబ్బులు వసూలు చేసి తెచ్చి ఇవ్వలేను అంటే.. ఉపసర్పంచ్‌ని సర్పంచ్ సీట్లో కూర్చొబెడతా.. నీకు చేతనైనది చేసుకోపో అన్నాడు. కాంగ్రెస్ గెలిచి.. టీఆర్ఎస్ చేరిండు. కానీ టీఆర్ఎస్ వాళ్ళను పట్టించుకోకుండా.. కాంగ్రెస్ వాళ్లనే పట్టించుకుంటుండు’ అని సర్పంచ్ మల్లమ్మ ఆరోపించింది. 
అనంతరం అందరి సమక్షంలోనే మల్లమ్మ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవాలని ప్రయత్నించింది. పోలీసులు కలగచేసుకొని సర్పంచ్‌ను అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు.