హుజురాబాద్ గడ్డమీద ప్రజల మధ్య చిచ్చు పెడ్తున్నరు

హుజురాబాద్ గడ్డమీద ప్రజల మధ్య చిచ్చు పెడ్తున్నరు

హుజురాబాద్‌‌లో కొట్లాడుదామా ? గజ్వేల్ లో కొట్లాడుదామా అని సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సవాల్ విసిరారు. తాము తలుచుకుంటే పొలిమేరల దాకా తరిమి కొట్టే శక్తి ఉందన్నారు. నీచపు కుట్రలను, కేసీఆర్ ఎత్తులను తిప్పి కొట్టాల్సిన అవసరముందన్నారు. ప్రశాంతంగా ఉంటున్న హుజురాబాద్ గడ్డమీద ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈనెల 5వ తేదీన చర్చకు రావాలంటూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

 ఫ్లెక్సీలు, హోర్డింగుల ఏర్పాటుతో హుజురాబాద్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈటలకు బదులు తామే చర్చకు వస్తామంటూ పిలుపునిచ్చిన బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. టీఆర్ఎస్ నేతల తీరుపై ఈటల మండిపడ్డారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా హుజురాబాద్ లో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే... బహిరంగ చర్చ పేరుతో ఇరువర్గాలు అంబేద్కర్ చౌరస్తాకు చేరుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.