కేసీఆర్ ఏలుబడిలో స్థానిక సంస్థలు నిర్వీర్యం

కేసీఆర్ ఏలుబడిలో స్థానిక సంస్థలు నిర్వీర్యం

సీఎం కేసీఆర్ ఏలుబడిలో స్థానిక సంస్థలు అన్నీ నిర్వీర్యం అయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎంతో కష్టపడి గెలిచిన ఎంపీపీలు, జడ్పీటీసీలు టీఆర్ఎస్ పరిపాలనలో ఉత్సవ విగ్రహాలుగా మారారని అన్నారు. ఎమ్మెల్యేలే గ్రామాల్లో బాసులుగా అయ్యారంటూ మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండల ఎంపీపీ, స్థానిక సంస్థల గౌరవ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్ రెడ్డిని ఈటెల రాజేందర్ కలిశారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీపీలు, జడ్పీటీసీలకు బాధ్యతలతో పాటు నిధులు కూడా లేవన్నారు. కొన్ని వేల మంది సర్పంచ్ లు బీజేపీలో చేరుతామని తమకు చెబుతున్నారని అన్నారు. ఘట్ కేసర్ ఎంపీపీతో పాటు సర్పంచ్, ఉప్పసర్పంచ్ .. ఇలా చాలా మంది ప్రజా ప్రతినిధులు, బీజేపీలో చేరబోతున్నారని, తెలిపారు. బీజేపీలో చేరే నాయకుల హోదాను బట్టి పార్టీలో స్థానాలు కేటాయిస్తామని చెప్పారు. 

బానిస ప్రభుత్వంలో ఉంటారా..? బయటకు వస్తారా..? అంటూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు చాలా మంది బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పారు. వారం రోజుల్లో ఘట్ కేసర్ లో ఏర్పాటు చేసే సభలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ కావేరితో పాటు ఇతర టీఆర్ ఎస్ నాయకులు బీజేపీలో చేరబోతున్నారని ఈటల రాజేందర్ చెప్పారు.