
నకిరేకల్ (శాలిగౌరారం)/హైదరాబాద్, వెలుగు: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన ప్రోగ్రామ్ కు రానోళ్లకు పింఛన్లు ఇస్తే... ‘‘నీ లాగు పగుల్తది” అంటూ పంచాయతీ సెక్రటరీని హెచ్చరించారు. ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వచ్చినోళ్లకే కొత్త కార్డులు ఇవ్వాలని, మిగతా వారికి ఇవ్వొద్దంటూ ఆదేశించారు. అటు పింఛన్ లబ్ధిదారులను అవమానిస్తూ, ఇటు పంచాయతీ సెక్రటరీని బెదిరిస్తూ ఎమ్మెల్యే చేసిన కామెంట్లపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. శనివారం నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల కొత్త బిల్డింగ్ తో పాటు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కిశోర్ శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆఫీసులో నిర్వహించిన పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ టైమ్ లో ఇక్కడ సెక్రటరీ ఎవరంటూ ఎమ్మెల్యే కిశోర్ ప్రశ్నించగా... తానేనంటూ సెక్రటరీ వెంకన్న జవాబు ఇచ్చారు. అప్పుడు ‘‘వెంకన్న.. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్లకు కాకుండా, మిగతా వాళ్లకు నూతన కార్డులు ఇచ్చినవనుకో నీ లాగు పగుల్తది” అంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎమ్మెల్యే ఇలా మాట్లాడడంతో అక్కడున్నోళ్లందరూ విస్తుపోయారు. ఆయన కామెంట్లపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తీరు మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తం: సెక్రటరీలు
ఎమ్మెల్యే కిశోర్ కామెంట్లపై పంచాయతీ సెక్రటరీలు ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేశ్, విజయ్, పంచాయతీ సెక్రటరీల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని శనివారం ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో కార్యదర్శులే కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. సెక్రటరీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇకపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, పథకాలు అమలు చేయకుండా నిలిపివేస్తామని హెచ్చరించారు. కిషోర్ తన తీరు మార్చుకోకుంటే, రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని వార్నింగ్ ఇచ్చారు.