మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే వినోద్,

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే వినోద్,
  •     ఇందిర మహిళ శక్తి సంబరాల్లో ఎమ్మెల్యే వినోద్, కలెక్టర్ దీపక్ 

బెల్లంపల్లి, వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ ​హాల్​లో జరిగిన ‘ఇందిరా మహిళ శక్తి’ సంబరాల్లో కలెక్టర్ కుమార్ దీపక్​తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐకేపీ ఆధ్వర్యంలో వడ్డీలేని రుణాలు, బ్యాంక్ లింకేజీలు, రుణ బీమా, ప్రమాద బీమా, ఆర్టీసీ బస్సుల అద్దె చెల్లింపులు, కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు కంకణం కట్టుకుందన్నారు. బెల్లంపల్లిలో రూ.25 కోట్లకు పైగా వడ్డీలేని రుణాలు మంజూరయ్యాయని, శ్రీనిధి పథకం కింద రూ.16.49 కోట్ల లక్ష్యంలో ఇప్పటికే రూ.6.8 కోట్ల రుణాలు అందించినట్టు తెలిపారు. 

రైతు భరోసా పథకం కింద  47,500 మంది రైతుల ఖాతాల్లో రూ.70 కోట్లు జమ చేశామన్నారు. 4,565 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కిషన్, డీపీఎం స్వర్ణలత, కాంగ్రెస్ నేతలు రామచందర్, సూరిబాబు, నాతరి స్వామి తదితరులు పాల్గొన్నారు.