పటాన్ చెరు అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్​చెరు, వెలుగు: పటాన్​చెరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన ఇంద్రేశం, జిన్నారం, ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలకు శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. 

ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డ్ లేకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి రాంకీ ఆధ్వర్యంలోని డంపింగ్ యార్డ్ ప్లాంటుకు చెత్తను తరలించే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఇస్నాపూర్ చౌరస్తాలో విశాల ప్రాంగణంలో మున్సిపల్ ఆఫీసు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అమీన్​పూర్​ మున్సిపల్ పరిధిలోని బంధం కొమ్ము, తెల్లాపూర్ పరిధిలోని ఉస్మాన్ నగర్ ప్రాంతాల్లో హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన రిజర్వాయర్లను సెప్టెంబర్ 10న ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్​ కమిషర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.