
- కాళేశ్వరం కూలితే ఎండాకాలం మత్తడి ఎట్లా దుంకింది ? యాసంగి ఎట్లా పండింది ?
సిద్దిపేట రూరల్, వెలుగు : రేవంత్‌రెడ్డి నోరు విప్పితే అన్ని అబద్ధాలే చెబుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరం కూలితే ఎండకాలం చెరువులు మత్తడి ఎట్లా దుంకుతున్నాయని, యాసంగి పంటలు ఎట్లా పండాయని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌లో జరిగిన పెద్దమ్మ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘కాళేశ్వరం కూలింది అనే వారు విఠలాపూర్ గ్రామానికి వచ్చి చూడాలి, కాళేశ్వరం నీళ్లు రాకుంటే ఎండకాలంలో విఠలాపూర్ గ్రామ అనంతమ్మ చెరువు ఎట్లా మత్తడి దుంకుతుంది’ అని ప్రశ్నించారు.
గతంలో బోరు వేయాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేదని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో నీళ్ల బాధలు పోయి కాలువలు, చెరువులకు జలకళ వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తా అన్న రూ.2,500, రూ. 4 వేల పెన్షన్ వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో ప్రతిష్ఠించిన మహంకాళి ఆలయ పూజల్లో, దుర్గామాత దేవాలయ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో యాదవ సంఘం సీనియర్ నాయకులు శ్రీహరి యాదవ్, ఐలయ్య యాదవ్, గంధం రాజు పాల్గొన్నారు.