
సంగారెడ్డి, వెలుగు : ‘ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ విషయంలో అంతా మీ ఇష్టమేనా ? అలైన్‌మెంట్‌ను ఇష్టారాజ్యంగా మార్చి పేదల కడుపు కొడతారా ? ’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలానికి చెందిన 10 గ్రామాల రైతులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం హరీశ్‌రావును కలిశారు. అలైన్‌మెంట్‌ను మార్పించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు పంట భూములను కోల్పోతున్నారన్నారు. పచ్చటి పొలాల మీదుగా రోడ్డు వేసి రైతుల నోట్లో మట్టికొట్టడం సరికాదన్నారు.
అలైన్‌మెంట్ మార్పు కారణంగా కొండాపూర్ మండలంలో ఎక్కువగా ఎస్టీ, ఎస్సీ బీసీ రైతులే నష్టపోతున్నారన్నారు. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్‌కు 40 కిలోమీటర్లు దూరం ఉండాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా 23 కిలోమీటర్ల దూరంలోనే ట్రిపుల్ ఆర్‌ను చేపడుతున్నారని విమర్శించారు. రియల్టర్లు, కాంగ్రెస్ లీడర్ల భూములు పోకుండా.. రైతులకు మాత్రమే నష్టం జరిగేలా అలైన్‌మెంట్‌ను మార్చడం దుర్మార్గం అన్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.