
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారని.. ఇంతకుముందెన్నడూ ఎక్కడా ఇలాంటి పరిస్థితులు చూడలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ చేతగాని పాలన వల్ల రైతులు పంటపొలాలు వదిలి యూరియా కోసం రోడ్ల వెంట బారులు తీరుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
యూరియా కోసం రైతులు హైవేలెక్కి ధర్నాలు చేసే దుస్థితి వచ్చిందన్నారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభమని, రేవంత్ నిర్లక్ష్యం వల్లే రైతులకు కష్టాలొచ్చాయని ఆరోపించారు. అసెంబ్లీలో యూరియా కొరత, వరదల మీద చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే.. ప్రజాసమస్యలను గాలికి వదిలేసి కక్ష సాధింపులే లక్ష్యంగా ఆదివారం ఆదరాబాదరాగా సభ నిర్వహించిందని మండిపడ్డారు.
యూరియా అడిగిన పాపానికి రైతుల చెంపలు చెళ్లుమనిపించిన సోకాల్డ్ ప్రజాపాలన ఇది అని విమర్శించారు. కేసీఆర్ పాలనలో సకాలంలో సరఫరా అయిన యూరియాను ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ‘‘పాలకులు మారగానే పాలసీలు మారిపోతాయా? రైతుల కష్టాలు తీర్చని ప్రభుత్వం ఉండీ ఏం లాభం’’ అని నిలదీశారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నతో కన్నీళ్లు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. జైకిసాన్ అని నాటి కాంగ్రెస్ అంటే.. నై కిసాన్ అని నేటి రేవంత్ సర్కారు అంటున్నదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్పార్టీలకు 8 మంది చొప్పున ఎంపీలున్నా ప్రయోజనమేమీ లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపాలు నెట్టుకోవడం తప్ప రైతుల కష్టాలను మాత్రం తీర్చడం లేదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి రైతాంగానికి మరణశాసనంగా మారిందని ఆయన ఫైర్ అయ్యారు.