- ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు ఇద్దరూ ఒక్కటే
- మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: గురువుల మధ్య భేదం వద్దని, ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు ఇద్దరూ ఒక్కటే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శనివారం సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ హాల్ లో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై టీచర్ల ను సన్మానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. అందరూ టీచర్ల కృషి వల్లే టెన్త్ ఫలితాల్లో సిద్దిపేట అగ్రగామిగా నిలిచిందన్నారు. జీతాలు తక్కువ ఉండొచ్చు కానీ సామర్థ్యం విషయంలో ప్రైవేట్టీచర్లు ఎవరికీ తీసిపోరన్నారు. బెస్ట్ అవేలబుల్ స్కూల్ నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులకు అండగా ఉంటా
జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మీడియా పాయింట్ ను ప్రారంభించి కొత్త కమిటీని అభినందించారు. సిద్దిపేట అర్బన్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ఐక్యతకు మారుపేరుగా నిలుస్తూ ముందుకు వెళ్లడం సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో జర్నలిజంలో మరింత రాణించాలని ఆకాక్షించారు. అంతకుముందు పట్టణానికి చెందిన ప్రవీణ్ రాధ దంపతులు దారాలతో వేసిన ఫొటోను హరీశ్‌రావుకు అందజేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ సంపత్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగాచారి, టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లు, అర్బన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.