రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక..

రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక..

ప్రజలకు కాంగ్రెస్ పార్టీని దూరం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు... ప్రజల మధ్యకు వెళ్లకుండా  ఈడీ ఆఫీస్ల చుట్టూ తిప్పాలని బిజెపి ప్లాన్ చేసిందని ఆరోపించారు. రాజకీయ హత్యలు చేసిన ఘనత బీజేపీదని ఆయన మండిపడ్డారు. అన్ని శాఖలను అదుపులో పెట్టుకున్న బీజేపీ... కాంగ్రెస్ పై కుట్ర పన్నిందని చెప్పారు.  ధర్నా చేస్తే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపిలను కక్షపూరితంగా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. సోనియాగాంధీ పై ఈడీ కేసులకు  నిరసనగా  సంగారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి  ఎమ్మెల్యే జగ్గారెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

నేషనల్ హెరాల్డ్ పత్రికతో బీజేపీకి ఏం సంబంధమని జగ్గారెడ్డి ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ స్వాతంత్రం కోసం పని చేసిన పత్రిక అని చెప్పారు.  ఆంగ్లేయుల కదలికలను, చర్యలను  యావత్తు దేశానికి పత్రిక తెలియజేసిందన్నారు. 75 సంవత్సరాల తర్వాత ఈడి కేసు నమోదు చేయడం హాస్యాస్పదమన్నారు. పత్రికలో కామ, పుల్ స్టాప్ లు లేకున్నా తప్పన్నట్లు ఈడీ ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. గంటల తరబడి  సోనియాగాంధీని ప్రశ్నిస్తున్నారని...సామాన్య పౌరులుగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ జీవితం గడుపుతున్నారని చెప్పారు. గాంధీ కుటుంబానికి..కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.  కార్యకర్తలంతా సైనికులు లాగా పనిచేస్తామన్నారు.