బాలానగర్, వెలుగు: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, దీనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని జీడిగుట్ట తండాలో ఇందిరమ్మ ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, తండాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రత్యేక నిధులు కేటాయించి పనులు వేగవంతం చేస్తున్నామని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం..
జడ్చర్ల టౌన్: బీఆర్ఎస్ బీసీల వ్యతిరేక పార్టీ అని, జాబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జడ్చర్లలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధి ఏమిటనేది రాష్ట్రంలోని బీసీలందరికీ తెలుసన్నారు.
మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడిన బీఆర్ఎస్కు ఇప్పుడు నవీన్‌యాదవ్ గెలుపు కోసం సీఎం ప్రచారం చేస్తుండడంతో నిద్ర పట్టడం లేదన్నారు. బీజేపీకి డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదన్నారు. నవీన్‌యాదవ్ స్థానికుడని, ఆయన అందుబాటులో ఉండి తమ సమస్యలు పరిష్కరిస్తాడని జూబ్లీహిల్స్ ఓటర్లు అభిప్రాయపడుతున్నారని చెప్పారు.
