హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం తమ అనుచరులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిలో వీళ్లు కూడా ఉన్నారు. మిగిలిన 8 మంది స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతుండగా, మాజీ మంత్రులు దానం, కడియం మాత్రం ఇప్పటివరకు స్పీకర్ నోటీసులకు స్పందించలేదు.
వీరిద్దరూ కాంగ్రెస్‌లో చేరారనేందుకు బలమైన ఆధారాలు ఉండడం వల్లే విచారణకు హాజరు కావడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో స్పీకర్ తీర్పు ఉండడంతో ఆలోపే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లాలని ఇద్దరూ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అనుచరులతో సమావేశమై రాజీనామాపై వారి అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం, కడియం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో దానం నాగేందర్ 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఇక కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేయడంతో ఆమె తరఫున కడియం బహిరంగంగా ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ బహిరంగ సభల్లోనూ పాల్గొని ప్రసంగించారు. దీంతో వీరిద్దరూ పార్టీ ఫిరాయించారనేందుకు బలమైన ఆధారాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో మిగిలిన 8 మంది తాము పార్టీ మారలేదని స్పీకర్ ముందు వాదిస్తుండగా.. దానం, కడియం మాత్రం ఇప్పటివరకు పెదవి విప్పలేదు.
ఈ క్రమంలో వీరిద్దరిపై స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశమూ లేకపోలేదనే వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కడియం, దానం ఇద్దరూ తమ అనుచరులతో భేటీ అయి రాజీనామా విషయమై చర్చించినట్లు తెలిసింది. రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తేనే బాగుంటుందని సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో వీరిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొన్నది.
