స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా..ఫేస్ చేయడానికి నేను రెడీ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా..ఫేస్ చేయడానికి నేను రెడీ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరీ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీకోర్టు తీర్పు, స్పీకర్ అనర్హత వేటు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.  స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  తన  ఎన్నికల గురించి ఆలోచన వద్దన్నారు. ఉప ఎన్నిక  వస్తదా..రాదా ?  వస్తె ఏం చేద్దామనేది తర్వాత ఆలోచిద్దామన్నారు. 

ఏ గ్రామంలో చూసినా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలనేది తన టార్గెట్ అని చెప్పారు కడియం.  ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నారని. వాటన్నిటికీ మన గెలుపు ద్వారానే సమాధానం చెబుదామని సూచించారు.  నియోజకవర్గంలో పాత కొత్త వివాదం వద్దన్నారు.  ఎవరైతే గెలుస్తారో వాళ్లే మన హీరోలన్నారు.  అక్కడ ఇక్కడ తిరిగి ఆగం కావొద్దని.. అక్కడక్కడ తిరిగి పోస్టులు పెట్టి మీ ఫోటోలు పెట్టొద్దని.. మీరే నష్టపోతారని సూచించారు.  ఏం జరిగినా ఘన్ పూర్ నియోజకవర్గంలో తన నుంచే  నడుస్తుందని చెప్పారు

10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు.!

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌‌‌‌‌‌‌కుమార్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.  తొలి దశలో ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నుంచి నోటీసులు అందినట్టు సమాచారం. వీరిలో కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల) , అరెకపుడి గాంధీ (శేరిలింగంపల్లి) ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలకు సైతం త్వరలో  స్పీకర్​నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది.  

తమ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినందున వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ శాసనసభ పక్షం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణకు అటెండ్ అయి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరెకపుడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి (బాన్సువాడ)  గూడెం మహిపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి (పఠాన్ చెరు) సంజయ్ కుమార్  (జగిత్యాల), కాలె యాదయ్య (చేవేళ్ల), ప్రకాశ్‌‌‌‌‌‌‌‌గౌడ్ (రాజేంద్రనగర్) అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారని స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.  అయితే, ఈ 10 మంది అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నామని పలు సందర్భాల్లో ప్రకటించారు.

 పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని జూలై  25న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై న్యాయ నిపుణులతో స్పీకర్ ప్రసాద్ కుమార్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చర్చించినట్టు తెలుస్తున్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు లోపల 10 మంది ఎమ్మెల్యేలతో విచారణ జరిపి..  స్పీకర్ వివరణ తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. విచారణ పూర్తి అయ్యాక స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? లేదా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంచుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.  తనకు స్పీకర్ నుంచి నోటీసులు అందాయని, న్యాయ నిపుణులతో  చర్చించి వివరణ ఇస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి వెల్లడించారు.