బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పే మగాడు లేడు, పార్టీ లేదు: కడియం శ్రీహరి

బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పే మగాడు లేడు, పార్టీ లేదు: కడియం శ్రీహరి

జనగాం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పే మగాడు లేడు.. పార్టీ లేదని మాజీ మంత్రి, స్టేషన్ ఘన్‎పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం (అక్టోబర్ 12) స్టేషన్ ఘన్‎పూర్‎లో కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటానికి పేటెంట్ కమ్యూనిస్ట్ పార్టీదన్నారు. తెలంగాణ ఉద్యమానికి పేటెంట్ కేసీఆర్‎దైతే.. రాష్ట్రాన్ని ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ అని అన్నారు. దండోరా ఉద్యమానికి పేటెంట్ మందకృష్ణకు దక్కుతుంది.. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన పేటెంట్ సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ మంత్రులకు, ఎంపీలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 12 సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో, ఎన్నికలు వచ్చే రాష్ట్రాలలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బీజేపీకి ఇష్టమే లేదని.. రాష్ట్రం ఏర్పడిన విధానాన్ని బీజేపీ అనేక సందర్భాల్లో అవమానపరిచిందని ఫైర్ అయ్యారు.  తెలంగాణ ఏర్పాటు విషయంలో తల్లి చనిపోయి బిడ్డ బతికింది అన్నట్టు మోడీ మాట్లాడడం విడ్డూరమన్నారు. 

తెలంగాణలో పది సంవత్సరాలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతుందని ఎద్దేవా చేశారు. కుంగిపోయిన  కాలేశ్వరం కట్టి కేసీఆర్, హరీష్ రావు దోషులుగా మిగిలిపోయారని అన్నారు. కేటీఆర్ ఫార్ములా కార్ రేస్ కేసులో నిందితుడిగా ఉంటే.. కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లివచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ సంపద దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం అన్నారు.