ఆసక్తి రేపుతున్న  మునుగోడు పాలిటిక్స్​ 

ఆసక్తి రేపుతున్న  మునుగోడు పాలిటిక్స్​ 

నల్గొండ, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల పాలిటిక్స్​ ఆసక్తి రేపుతున్నాయి. బీజేపీలో చేరాలని భావిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి  నియోజకవర్గ ముఖ్య అనుచరులతో మంగళవారం హైదరాబాద్​లోని తన ఇంట్లో భేటీ అయ్యారు. పార్టీ మారాలా? వద్దా? మారితే పదవికి రాజీనామా చేయాలా? వద్దా ? అనే అంశంపై వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. తన రాజీనామాతో  నియోజకవర్గానికి మేలు జనరుగుతుందన్న ఎమ్మెల్యే, వారంలోగా ఒపీనియన్స్​ చెప్పాలని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. మరోవైపు గట్టుప్పల్​ను మండల కేంద్రంగా ప్రకటించినందుకు కృతజ్ఞతగా లోకల్​గా ఏర్పాటుచేసిన  కృతజ్ఞత సభలో మంత్రి జగదీశ్​రెడ్డి పాల్గొని రాజగోపాల్​రెడ్డిపై ఫైర్​ అయ్యారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని ప్రత్యర్థులతో చేతులు కలిపి రాజకీయాలు చేస్తున్నారన్నారు.

నా రాజీనామాతో  నియోజకవర్గానికి మేలు: రాజగోపాల్​రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మంగళవారం చండూరు  మున్సిపాలిటీ, రూరల్,​నాంపల్లి, మర్రిగూడ మండలాలకు చెందిన ముఖ్యనాయకులు, అనుచరులతో హైదరాబాద్​లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఒక్కో మండలం నుంచి 200 మంది హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్​ను కొట్టాలనే కామన్​ ఎజెండా ఉన్నందున బీజేపీ పెద్దలు తనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారని చెప్పారు. మూడేండ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అధికార పార్టీ సహకరించకపోవడంతో నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని, ఇంకో ఏడాదిన్నర పదవిలో ఉన్నా ఏమీ చేయలేనన్నారు. అదే పార్టీ మారి, రాజీనామా చేస్తే  సీఎం కేసీఆర్​ మునుగోడుకు రెండు, మూడు వేల కోట్ల నిధులు ఇస్తాడని, ఐదు టర్మ్​లు అపోజిషన్​లో ఉన్నా అన్ని నిధులు తాను తీసుకరాలేనని చెప్పారు. కానీ మెజారిటీ సభ్యుల అభిప్రాయానికే కట్టుబడి ఉంటానని.. మీరు ఓకే అంటేనే పార్టీ మారుతానన్నారు.  ఇప్పటికిప్పుడు మీ ఒపీనియన్​ చెప్పకపోయినా వారం రోజులు ఆలోచించి చెప్పాలన్నారు. భేటీలో పాల్గొన్న పలువురు ముఖ్యలు పార్టీ మారవద్దని, రాజీనామా చేయవద్దని  కోరగా,  మరికొందరు మాత్రం ఎమ్మెల్యే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, ఏది ఏమైనా ఆయన వెంట నడుస్తామని చెప్పినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ ముఖ్యులతో రాజగోపాల్​ చర్చలు కొనసాగాయి. కాగా, బుధవారం మునుగోడు, సంస్థాన్​ నారాయాణ్​పూర్​, చౌటుప్పుల్​ మండల లీడర్లతో భేటీ ఉంటుందని ఎమ్మెల్యే వర్గీయులు తెలిపారు. దీనిని బట్టి రాజగోపాల్​రెడ్డి రాజీనామాపై వారం రోజుల తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. 

టీఆర్​ఎస్​లో చేర్చుకోవాలని కేసీఆర్​ చుట్టూ తిరిగిండు: మంత్రి జగదీశ్​రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్​ పదవులను అడ్డం పెట్టుకొని ప్రత్యర్థులతో చేతులు కలిపి కుట్రలు చేస్తున్నారని, పూటకోమాట మాట్లాడే చరిత్ర వాళ్లదని మంత్రి జగదీశ్​రెడ్డి ఫైర్​ అయ్యారు. గట్టుప్పుల్​ను మండలంగా ప్రకటించినందుకు కృతజ్ఞతగా గట్టుప్పల్​లో మంగళవారం నిర్వహించిన సభలో సర్పంచ్​ రోజాతోపాటు, పలువురు నాయకులు టీఆర్​ఎస్​లో చేరారు. ఇందులో పాల్గొన్న జగదీశ్​రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్ కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరన్నారు. గతంలో టీఆర్​ఎస్​లో చేరాలని సీఎం కాళ్లు పట్టుకునేందుకు రాజగోపాల్​రెడ్డి వంద సార్లు చీకట్లో తిరిగినా కేసీఆర్​ అపాయింట్మెంట్​ ఇవ్వలేదన్నారు. మంత్రినని కూడా చూడకుండా తన చేతుల్లో నుంచి మైక్​ను గుంజుకున్న సంస్కార హీనుడు రాజగోపాల్​రెడ్డి అని మండిపడ్డారు. ‘నువ్వు ఏర్పాటుచేసిన ఫౌండేషన్ ద్వారా రూ.5 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పు’ అని సవాల్​ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసినా కేసీఆర్​ ను ఓడించలేవన్నారు. మూడున్నరేండ్ల  పదవీ కాలంలో    కాంట్రాక్టుల కోసం అమిత్ షా వద్ద  మోకరిల్లేందుకే సరిపోయిందన్నారు. గతంలో గట్టుప్పుల్​ మండలాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిగా తాను ప్రతిపాదిస్తే రాజగోపాల్​రెడ్డి పిటిషన్ ​వేసి అడ్డుకున్నాడన్నారు. గట్టుప్పుల్​ మండల అభివృద్ధికి సీఎంతో సంప్రదించి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రైతు వేదికను ప్రారంభించి,  సీసీ రోడ్లకు, చేనేత సహకార సొసైటీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి, జడ్పీటీసీ వెంకటేశం, కైలాసం పాల్గొన్నారు.