
దుబ్బాక, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మంత్రి ఇలాఖాలోనే వైద్యానికి సుస్తీ చేసిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అక్భర్పేట, భూంపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీ ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేసి యాదవ సంఘ భవనాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్‌రావు ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించారన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా ఉమ్మడి జిల్లాకు చెందిన వైద్యారోగ్య శాఖ మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందన్నారని, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలను భ్రష్టు పట్టించడమే మార్పా అని ప్రశ్నించారు. యూరియా, డీఏపీ బస్తాలను రైతులకు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రామ పంచాయతీ వ్యవస్థ చిన్నా భిన్నమైందన్నారు. ప్రయాణికులకు సరిపడా బస్సులను దుబ్బాక డిపోకు సమకూర్చాలని ఎండీ సజ్జనార్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్లు, ఫర్నిచర్ అందజేశారు.