
హైదరాబాద్, వెలుగు: సింగరేణికి విద్యుత్‌శాఖ రూ.20 వేల కోట్ల మేర బకాయి పడిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆ సంస్థ ఉద్యోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారికి కనీసం ఇండ్లు కూడా ఇవ్వడం లేదని, ఉన్న ఇండ్లు కూల్చేస్తున్నారని తెలిపారు. కరెంటు గురించి మాట్లాడేప్పుడు సింగరేణి గురించి కూడా మాట్లాడితే బాగుండేదని సూచించారు. విద్యుత్ రంగంలో రూ.80 వేల కోట్లు అప్పులు ఎందుకయ్యాయని, దానిపై వచ్చే ఆదాయం అంతా ఎటుపోతున్నదని ప్రశ్నించారు. సోమవారం బడ్జెట్పద్దుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో పదేండ్లు సీఎండీగా ఉన్న వ్యక్తి అవకతవకలకు పాల్పడ్డారని, ప్రభుత్వం కూడా అందులో ఇన్వాల్వ్ అయిందని ఆరోపించారు. సింగరేణి, విద్యుత్ ను కలిపి చూస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అక్రమాలకు సంబంధించి రెండింటికీ లింకులుంటాయన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ వైట్ఎలిఫెంట్లా మిగిలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అక్కడ పిట్హెడ్స్ లేవని, వయబిలిటీ చూసుకుని పవర్ ప్లాంట్ ను నిర్మించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొత్తగూడెంకు సంబంధించి అన్ని సౌలతులు ఉంటాయని, దానిని వదిలేసి సౌలతులు లేని చోటకు మార్చారని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు సొంత ఇండ్లు, సౌలతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
కనీస వేతన చట్టాలను అమలు చేయండి
అసంఘటిత రంగ కార్మికుల గురించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రొవిజన్ లేదని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అసంఘటిత రంగ, ప్రైవేటు రంగ కార్మికులను ఆదుకోవడానికి కనీస వేతన చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయగలిగితే కోట్ల మంది ప్రజలకు లబ్ధి కలుగుతుందన్నారు.