
- కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తం: ఎమ్మెల్యే కూనంనేని
- కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను అనుసరిస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. రాష్ట్ర సామగ్ర అభివృద్ధితో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ త్వరలోనే లక్షలాది మందితో తెలంగాణను దిగ్బంధనం చేస్తామని పేర్కొన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఈ ఫ్యాక్టరీ సాధించే వరకు పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. సీపీఐ స్టేట్ ఆఫీస్ మగ్దుంభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా విధానాలకు వ్యతిరేకంగా దశలవారీగా ఉద్యమాలు చేపడ్తాం. ఉద్యోగ, ఉపాధ్యాయ, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ఆర్టీసీలో ఇప్పటివరకు కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. వారి సమస్యలు పరిష్కరించలేదు.
సింగరేణిని ప్రైవేటీకరణ దిశగా చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి తగదు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నియంతలా వ్యవహరిస్తున్నారు’’అని సాంబశివరావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ఇతర ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ జాగాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ప్రభుత్వం వెంటనే పట్టాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.
రవీంద్రభారతిలో ఈ నెల 30న ఉదయం 11 గంటలకు కమ్యూనిస్టు దిగ్గజం, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట రెడ్డి, పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఉన్నారు.