
హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యానికి పునాదులైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడు పిల్లర్లు అయితే.. నాలుగో పిల్లరే మీడియా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ నాలుగు పిల్లర్లు కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరి కుంగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థలను తిరిగి నిలబెట్టడంతో పాటు దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు.
తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి.. న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడాలి’ అనే అంశంపై ఆదివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడారు. దేశాన్ని దోచుకుంటున్న కొంత మంది మాత్రం గద్దెనెక్కుతున్నారని అన్నారు.
‘‘దేశంలో కొద్దో గొప్పో న్యాయవ్యవస్థ పనిచేస్తున్నది. అందుకే సమాజం మనుగడ సాగిస్తున్నది. న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు జరిగే ప్రతి ఉద్యమంలో సీపీఐ ప్రత్యక్షంగా పూర్తి భాగస్వామ్యం అవుతుంది’’అని కూనంనేని అన్నారు.