కారు యాక్సిడెంట్​లో .. ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం

కారు యాక్సిడెంట్​లో ..  ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం
  • ఓఆర్ఆర్​పై అదుపుతప్పి రెయిలింగ్​ను ఢీకొట్టిన కారు
  • తలకు బలమైన గాయాలతో స్పాట్​లోనే కన్నుమూత
  • డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్​తో ప్రమాదం.. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే తీవ్ర గాయాలు
  • భౌతికకాయానికి సీఎం రేవంత్, మంత్రుల నివాళి
  • అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
  • ఏడాది కిందటే లాస్య తండ్రి సాయన్న మృతి 

హైదరాబాద్/సికింద్రాబాద్/సంగారెడ్డి, వెలుగు: సికింద్రాబాద్ – కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్​ఎస్​ నేత లాస్య నందిత (37) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్‌‌చెరు వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌‌‌‌ఆర్‌‌)‌‌పై రెయిలింగ్‌‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో లాస్య నందిత స్పాట్​లోనే చనిపోయారు. ఆమె పీఏ కమ్ డ్రైవర్‌‌‌‌ ఆకాశ్‌‌కు తీవ్ర గాయాలు కాగా.. ప్రస్తుతం మియాపూర్‌‌‌‌లోని శ్రీకర హాస్పిటల్‌‌లో ట్రీట్​మెంట్ పొందుతున్నాడు. లాస్య మృతితో ఆమె కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. 

ఏడాది కిందనే లాస్య తండ్రి, మాజీ ఎమ్మెల్యే సాయన్న చనిపోగా.. ఇప్పుడు లాస్య ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. లాస్య నందిత మృతిపై సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి, మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. లాస్య భౌతికకాయానికి రేవంత్‌‌‌‌, కేసీఆర్ తదితరులు నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. కాగా, లాస్య నందిత అంత్యక్రియలను శుక్రవారం సాయంత్రం ఈస్ట్ మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. 

సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో.. 

లాస్య నందిత కారు ప్రమాదంపై పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తు వివరాలను సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ సంజీవరావు మీడియాకు వెల్లడించారు. లాస్య నందిత, ఆమె కుటుంబసభ్యులు గురువారం అర్ధరాత్రి రెండు కార్లలో సదాశివపేట మండలం ఆరూర్ గ్రామంలోని మిస్కిన్ షా బాబా దర్గాకు వెళ్లారు. దర్గాను దర్శించుకుని, తిరిగి హైదరాబాద్‌‌‌‌కు పయనమయ్యారు. ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్స్​ ప్రయాణిస్తున్న కారు మేడ్చల్ ​పాయింట్​వద్ద ఔటర్​ దిగి హైదరాబాద్​వెళ్లగా, ఎమ్మెల్యే మాత్రం టిఫిన్​ కోసమని తిరిగి ఔటర్​ఎక్కి సంగారెడ్డి వైపు బయలుదేరారు.

ఈ సమయంలో లాస్య పీఏ కమ్ డ్రైవర్ ఆకాశ్ కారు నడుపుతున్నాడు. సుల్తాన్‌‌‌‌పూర్ టోల్‌‌‌‌ప్లాజా దాటి కొంచెం ముందుకెళ్లిన తర్వాత డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో కారు అదుపుతప్పింది. రోడ్డుకు ఎడమ వైపున్న రెయిలింగ్ ను బలంగా ఢీకొట్టింది. ఉదయం సుమారు 5 గంటల 10 నిమిషాలకు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్‌‌‌‌ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 108 అంబులెన్స్‌‌‌‌కు సమాచారమివ్వగా సిబ్బంది అక్కడికి చేరుకుని లాస్య నందితను పరీక్షించి అప్పటికే ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు.

తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ ఆకాశ్ ను మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం, ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదం జరిగిందని.. లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే తలకు తీవ్ర గాయాలయ్యాని పోలీసులు తెలిపారు. ‘‘ప్రమాదం జరిగిన టైమ్​లో ఆకాశ్​ డ్రైవింగ్ చేస్తున్నాడు. టోల్​గేట్​ దాటగానే తన కళ్లు మూసుకుపోయినట్టు అనిపించిందని, ఆ తర్వాత తనకు ఏం గుర్తులేదని ఆకాశ్​ చెప్పాడు. ఎమ్మెల్యే లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ఎయిర్ బెలూన్లు తెరుచుకోలేదు. ఆమె తల డోర్ కు బలంగా తగిలింది. పక్కటెముకలు విరిగి ఎడమ కాలు పూర్తిగా డ్యామేజ్ అయింది. తలకు బలమైన గాయాలు కావడంతో స్పాట్ లోనే ఎమ్మెల్యే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తున్నాం” అని అడిషనల్ ఎస్పీ సంజీవరావు తెలిపారు.  

భారీగా తరలొచ్చిన అభిమానులు 

లాస్య నందిత భౌతికకాయాన్ని గాంధీ హాస్పిటల్‌‌‌‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు బాడీని అప్పగించారు. లాస్య మరణ వార్త విని ఆమె కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. తల్లి గీత స్పృహ తప్పి పడిపోయింది. లాస్య సోదరి నివేదిత రోదన పలువురిని కంటతడి పెట్టించింది. లాస్య తండ్రి సాయన్న ఏడాది క్రితమే మరణించగా, ఇప్పుడు లాస్య చనిపోవడంతో అభిమానులు, కార్యకర్తలు విచారంలో మునిగిపోయారు.

గాంధీ హాస్పిటల్ వద్దకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌‌‌‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు గాంధీ హాస్పిటల్‌‌‌‌కు వచ్చి లాస్య కుటుంబానికి తోడుగా ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం సికింద్రాబాద్‌‌‌‌ గృహలక్ష్మి కాలనీలోని నివాసానికి లాస్య మృతదేహాన్ని తరలించారు. ఇక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో వచ్చారు. మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌, మాజీ మంత్రులు హరీశ్‌‌‌‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు లాస్య భౌతికకాయానికి నివాళులర్పించారు. 

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

లాస్య నందిత మరణ వార్త తనను బాధించిందని శుక్రవారం ఉదయం సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ట్వీట్ చేశారు. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయాలని సీఎస్‌‌‌‌ను ఆదేశించారు. మేడారం జాతర నుంచి తిరిగొచ్చిన తర్వాత మంత్రులు శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సికింద్రాబాద్‌‌‌‌ గృహలక్ష్మి కాలనీలోని లాస్య ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. శుక్రవారం సాయంత్రం గృహలక్ష్మి కాలనీ నుంచి ప్రారంభమైన లాస్య నందిత అంతిమయాత్ర ఈస్ట్‌‌‌‌ మారేడుపల్లిలోని శ్మశానవాటిక వరకు కొనసాగింది.

ఈ అంతిమయాత్రలో పలువురు రాజకీయ ప్రముఖలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ మంత్రులు హరీశ్‌‌‌‌రావు, ప్రశాంత్‌‌‌‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాడె మోశారు. కాగా, గతేడాది ఫిబ్రవరిలో అప్పటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేత సాయన్న అనారోగ్యంతో మరణించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన అంత్యక్రియలను ఆనాటి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేదు. దీంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 

2015లో రాజకీయాల్లోకి.. 

దివంగత ఎమ్మెల్యే సాయన్న, గీత దంపతుల మూడో కూతురు లాస్య నందిత 1986లో జన్మించారు. ఆమెకు ఇద్దరు అక్కలు నమ్రత, నివేదిత ఉన్నారు. లాస్య నందిత నారాయణగూడలోని రత్నాకర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో తండ్రితో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 2015 నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

2015లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో మెంబర్​గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2016లో తన తండ్రి సాయన్నతో కలిసి  బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు కవాడిగూడ కార్పొరేటర్ గా పోటీ చేసి విజయం సాధించారు. మళ్లీ 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. గతేడాది తన తండ్రి సాయన్న మరణించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ లాస్య నందితకు ఇచ్చారు. ఆమె 17 వేల ఓట్ల మెజార్టీతో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

ప్రముఖుల సంతాపం

కంటోన్మెంట్​ బీఆర్​ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మంత్రులు ఉత్తమ్​ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సంతాపం ప్రకటించారు. రాష్ట్రం యువ నాయకురాలిని కోల్పోయిందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. నందిత మృతి బీఆర్​ఎస్​ పార్టీకి తీరని లోటు అని ఎంపీ కే.కేశవ రావు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీశ్ రావు, వేముల ప్రశాంత్​ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత అన్నారు. నందిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. లాస్య నందిత మరణ వార్త దిగ్ర్భాంతికి గురిచేసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. లాస్య నందిత మరణం బాధాకరమని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ తెలిపారు. ఆమె మరణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర సర్కార్​ను కోరారు.

డ్రైవర్ ఆకాశ్ పై కేసు

లాస్య నందిత పీఏ కమ్ డ్రైవర్ ఆకాశ్​పై పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. లాస్యనందిత  సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు అతనిపై 304ఏ సెక్షన్ కింద కేసు పెట్టారు. ఆకాశ్​ హడావిడి చేసి లాస్యను తీసుకెళ్లాడని.. నిర్లక్ష్యంగా, ర్యాష్​గా కారు డ్రైవ్ చేయడం వల్లే ఆమె మృతి చెందిందని నివేదిత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉదయం 5:15 గంటలకు ఇద్దరికీ గాయాలయ్యాయని ఆకాశ్​ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిందని, అక్కడికి వెళ్లి చూసేసరికి కారు నుజ్జునుజ్జయిందని తెలిపింది.

వరుస ప్రమాదాలు

లాస్య నందిత ఎమ్మెల్యేగాఎన్నికైన ఈ మూడు నెలల కాలంలో మూడుసార్లు ప్రమాదానికి గురయ్యారు. పోయినేడాది బోయిన్‌‌‌‌పల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి, అక్కడున్న లిఫ్ట్‌‌‌‌లో ఇరుక్కుపోయారు. సిబ్బంది దాదాపు మూడు గంటల పాటు శ్రమించి లిఫ్టును రిపేర్ చేసి ఆమెను రక్షించారు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న కొద్దిరోజులకే.. ఈ నెల 13న నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా, లాస్య నందిత ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తర్వాతే ఎక్స్‌‌‌‌ఎల్‌‌‌‌ 6 కారును కొనుగోలు చేశారు. ఇప్పుడు అదే కారులో వెళ్తూ ప్రమాదానికి గురై మరణించారు.

చాలా బాధాకరం

లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె తండ్రి, స్వర్గీయ సాయన్నతో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన నిరుడు చనిపోయారు. ఇంతలోనే నందిత కూడా ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.
- సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి

కుటుంబానికి అండగా ఉంటాం

అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
- మాజీ సీఎం కేసీఆర్

రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు

లాస్య నందిత మృతి తీవ్రంగా కలిచి వేసింది. చిన్న వయసులో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అకాల మరణం బాధాకరం. కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌గా, ఎమ్మెల్యేగా రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. మంచి భవిష్యత్ ఉన్న ఆమె మన మధ్య లేకపోవడం మరిచిపోలేము.
- బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​రెడ్డి