అశ్రునయనాల మధ్య ముగిసిన ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు

అశ్రునయనాల మధ్య ముగిసిన ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. ఈస్ట్‌ మారేడుపల్లి శ్మశానవాటికలో ఆమెకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్మశానవాటికకు బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు.

అంతకుముందు సికింద్రాబాద్‌ కార్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం నుంచి అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నియోజకవర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని.. లాస్యకు తుది వీడ్కోలు పలికారు.

ఇంటి నుంచి బయలుదేరిన అంతిమ యాత్రలో.. మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మరో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు.. లాస్య పాడె మోశారు. అంతిమ యాత్ర ప్రారంభం కావటం.. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడెమోయటం చూసిన అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.

లాస్య అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే లాస్య మరణం వార్త తెలిసినప్పటి నుంచి హరీశ్ రావుతోపాటు ఇతర నేతలు అన్నీ దగ్గరుండి చేశారు. పటాన్ చెరు ఆస్పత్రి నుంచి ఉస్మానియాకు రావటం.. పోస్టుమార్టం.. ఆ తర్వాత ఇంటికి తీసుకురావటం.. అంతిమ యాత్ర, అంత్యక్రియలు వరకు దగ్గరుండి పర్యవేక్షించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.