
రామచంద్రాపురం, వెలుగు: కొత్త రహదారుల ఏర్పాటుతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్‌లో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించే కొత్త రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్లోసం హైట్స్ అపార్ట్మెంట్స్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు కొత్త రోడ్డు ద్వారా కనెక్టివిటీ ఏర్పడనుంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీలో మరిన్ని కనెక్టివిటీ రోడ్లు నిర్మిస్తామన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రతి కాలనీని కలుపుతూ రవాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే తెల్లాపూర్ అభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, పార్టీలకు అతీతంగా తెల్లాపూర్ అభివృద్ధిలో ప్రతిఒక్కరూ కలిసి రావడం గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహా, రవీందర్ రెడ్డి, శ్రీశైలం, మల్లారెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.