బీజేపీ మరోసారి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ : మందుల సామేల్

బీజేపీ మరోసారి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ : మందుల సామేల్
  • మల్కాజిగిరిలో పట్నం సునీతారెడ్డి గెలుపు ఖాయం 
  • బయటకు కనిపించని పేదల వ్యతిరేకి బీజేపీ అభ్యర్థి ఈటల 

మేడిపల్లి, వెలుగు: మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ధీమావ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బయటకు కనపడని పేదల వ్యతిరేకి అని విమర్శించారు. బుధవారం బోడుప్పల్ లోని తన ఇంట్లో సామేల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని, సంపన్న వర్గాలకే కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. 

లోక్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని మండిపడ్డారు. బీజేపీ మరోసారి గెలిస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు.  బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదన్నారు.  తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉందన్నారు. ఒకప్పుడు ప్రజల పక్షాన నిలిచి ఎన్నో పోరాటాలు చేసిన సీపీఎం నేతలు అమ్ముడుపోయారని ఆయన ఆరోపించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలంతా ఆదరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో  రాష్ట్రం అన్నిరంగాల్లో దూసుకుపోతుందన్నారు. ఈ సమావేశంలో  కాంగ్రెస్ నేతలు కొత్త కిషోర్ గౌడ్, వత్తి మైసయ్య, ఆవర్ల బీరప్ప పాల్గొన్నారు.