- ఎమ్మెల్యే మందుల సామెల్
తుంగతుర్తి, వెలుగు: మహాత్మా జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయులు సమాజ సేవ కోసం చేసిన కృషిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పిలుపునిచ్చారు. పూలే మహిళా విద్య, కుల నిర్మూలన కోసం విశేష కృషి చేశారని, అణగారిన వర్గాల అభివృద్ధికి వారి జీవితాలే నేటి ప్రజానీకానికి దిక్సూచి అని పేర్కొన్నారు.
శనివారం తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, విద్యాభివృద్ధి, దళితుల అభ్యున్నతి కోసం వారు చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుడిపాటి సైదులు, సుంకర జనార్ధన్, సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.
