
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు ఎందుకు పోతున్నరో ప్రజలకు చెప్పాలని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ టూర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎందుకు రాలేదో కూడా చెప్పాలన్నారు. డ్యామేజీ కాలేదని, నీళ్లు లీక్ అవడం లేదని చెప్తరా? అని ఆయన ప్రశ్నించారు. గురువారం సీఎల్పీలో ఎమ్మెల్యే మందుల సామ్యేల్తో కలిసి రాంచంద్రునాయక్ మీడియాతో మాట్లాడారు. పదేండ్ల అవినీతి, ఇరిగేషన్, కృష్ణాజలాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై శ్వేత పత్రం విడుదల చేసి చర్చ చేస్తే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఇంజనీర్ల సలహాలు తీసుకోకుండా హడావుడిగా నిర్మించడంతోనే డ్యామేజ్ అయిందన్నారు. ఇపుడు నీళ్లు విడుదల చేస్తే అన్నారం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్తున్నారని రాంచంద్రునాయక్ తెలిపారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని లూటీ చేసిండు: సామ్యేల్
గడిచిన పదేండ్లలో ప్రజలకు తీరని అన్యాయం చేసి రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యేల్ మండిపడ్డారు. పొలాలకు నీళ్లు ఇవ్వకుండా వృథాగా నీళ్లు వదిలి రైతుల పొట్ట కొట్టారన్నారు. 24 గంటలు కాళేశ్వరమే నా డ్యూటీ అన్న హరీశ్ రావును పంపకాలు, కమీషన్ల దగ్గర గ్యాప్ రావటంతో ప్రాజెక్టు ఓపెనింగ్ కు కేసీఆర్ పిలవలేదన్నారు. కమీషన్ల కాళేశ్వరం అని నాయిని నర్సింహారెడ్డి అనటంతో 2018 లో టికెట్ ఇవ్వలేదన్నారు. దళితులను, గిరిజనులకు మోసం చేశారని, ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ గా తాడూరి శ్రీనివాస్ ను నియమించారని రూ.1000 కోట్లు ఇస్తా అని చెప్పి వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు ఉసురు తగిలడంతోనే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత మధ్య గొడవలు అయితున్నాయని, ఒకరి మీద మరొకరికి నమ్మకం పోయిందని అన్నారు.