
హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బీసీ సాధికారిత కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. శనివారం సీఎల్పీ మీడియా సెంటర్ లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అడుగడుగునా బీసీలను అణగదొక్కిందని ఫైర్ అయ్యారు. బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి రాజ్యాధికారానికి దూరం చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ డీఎన్ఏలోనే బీసీ, దళిత వ్యతిరేక భావజాలం ఉందని మండిపడ్డారు.
బీఆర్ఎస్, బీజీపీ నలుగురు వ్యక్తుల పార్టీలని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సోషల్ ఇంజినీర్ గా మారారని, మంత్రివర్గంలోకి నలుగురు దళితులకు చోటు కల్పించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. బీసీ రిజర్వేషన్లు కల్పించడంపై కవిత సంబరాలు చేసుకోవడం మంచిదేనని, కవిత తన తండ్రి, సోదరుడు, బావతో కలిసి సీఎం దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్పాలని సూచించారు. బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య.. ముఖ్యమంత్రికి అభినందనలు చెప్పారని గుర్తుచేశారు.