బండి సంజయ్ కి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సవాల్

బండి సంజయ్ కి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సవాల్

పాదయాత్ర కాదు.. కేంద్రం నుంచి నిధులు తేవాలని డిమాండ్​

జనగామ, వెలుగు: ‘తెలంగాణకు రూ.24 వేల కోట్ల ఫండ్స్ ఇవ్వాలని కేంద్రానికి నీతి అయోగ్ సిఫార్సు చేసినా.. ప్రధాని మోడీ ఇస్తలేడు. ఇది తప్పని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని తన క్యాంపు ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్​పాదయాత్ర వాయిదా వేసుకుని, ఢిల్లీకి పోయి రూ.24 వేల కోట్ల నిధులు పట్టుకురావాలని.. అలా చేస్తే పార్టీలకు అతీతంగా పాదయాత్రకు స్వాగతం పలుకుతామన్నారు. లేదంటే ఇక్కడి జనాలు ప్రశ్నించడం ఖాయమన్నారు. తెలంగాణలో మిషన్​ భగీరథకు రూ.19వేల కోట్లు, మిషన్ కాకతీయ పథకాలకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర సర్కారుకు నీతి అయోగ్ చెప్పినప్పటికీ మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.3 లక్షల 68 వేల కోట్లు చెల్లిస్తే..  కేవలం రూ.లక్షా 68 వేల కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారని ఆరోపించారు. ఉచితాలు వద్దంటున్న కేంద్రం.. తెలంగాణలోని ఏ పథకాన్ని నిలిపి వేయాలో చెప్పాలని డిమాండ్​చేశారు.

మెడికల్​ కాలేజీ వరం..

జనగామ జిల్లా కేంద్రంలో మెడికల్​ కాలేజీ నిర్మాణానికి పరిపాలన అనుమతులు వచ్చాయని.. రూ.192 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్​కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జనగామకు ఇది వరంగా మారనుందని, భవిష్యత్​ లో పీజీ కాలేజీ కూడా రానుందన్నారు. జనగామ శివారులోని రంగప్ప చెరువు మత్తడి నీటితోనే టౌన్​ లో కాలనీలు మునుగుతున్నాయని.. ఈ సమస్య పరిష్కారం కోసం రూ.9 కోట్ల 10 లక్షల నిధులు మంజూరు అయ్యాయన్నారు. వీటితో వరదనీరు సజావుగా బయటకు వెళ్లేలా డ్రైనేజీల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. సిద్ధిపేట కమాన్​ నుంచి కొమురవెళ్లి టెంపుల్​ వరకు రోడ్డు వెడల్పు కోసం రూ.10 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్​ఎస్​ నియోజకవర్గ కో ఆర్డినేటర్​ డాక్టర్​ గుజ్జా సంపత్​ రెడ్డి, జనగామ మున్సిపల్, వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్ పర్సన్​లు పోకల జమునలింగయ్య, బాల్డె విజయ సిద్ధిలింగం, ఎంపీపీ మేకల కలింగరాజు, కౌన్సిలర్లు వాంకుడోత్​ అనిత, డిస్ట్రిక్ట్​ హాస్పిటల్​ సూపరెంటెండెంట్​ డాక్టర్​ సుగుణాకర్​ రాజు, పార్టీ లీడర్లు పాల్గొన్నారు.