ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నుంచి ప్రాణహాని ఉంది : తిరుపతి నాయక్

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నుంచి ప్రాణహాని ఉంది : తిరుపతి నాయక్
  • తమకు ప్రభుత్వం రక్షణ కల్పించి న్యాయం చేయాలి
  • నిజాం కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుపతి నాయక్ కుటుంబం విజ్ఞప్తి

బషీర్​బాగ్, వెలుగు : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని నిజాం కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ భూక్యా తిరుపతి నాయక్, మౌనిక దంపతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొత్తలపర్రెకు చెందిన తమకు గ్రామంలోని సర్వే నెం.49, 88లో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. 

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌లోని నిజాం కాలేజీ వద్ద బుధవారం మీడియాతో వారు మాట్లాడారు. 30 ఏండ్ల కిందట భూమి అమ్ముకొని వెళ్లిన సమీప బంధువులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తమ కుటుంబంపై ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నాడని తిరుపతి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే అనుచరుల పేరు మీద తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడని, జనగామ ఏసీపీ దేవేందర్ రెడ్డికి చెప్పగా బెదిరింపులకు గురిచేశాడని ఆరోపించారు. స్థానిక రెవెన్యూ, పోలీసులు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని వాపోయారు. 

వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని న్యాయం చేయాలని లేదంటే తమ కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. గతంలోనే మూడుసార్లు హత్యాయత్నం జరిగినట్లు,  వారం కిందట ఎమ్మెల్యే అనుచరులు తమ వ్యవసాయ బావి దగ్గర మోటారు వైర్లు కట్ చేసి విద్యుత్ నిలిపివేసి దాడికి పాల్పడ్డారని తిరుపతి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వృద్ధ తల్లిదండ్రులపైన దాడులు చేస్తున్నా పట్టించుకునేవారే లేరని , తమ కుటుంబానికి ఏం జరిగినా ఎమ్మెల్యే ముత్తిరెడ్డినే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.  న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్‌‌‌‌,  గవర్నర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేస్తానని తిరుపతి నాయక్ తెలిపారు.