ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

జనగామ, వెలుగు: జనగామ జిల్లా కేంద్రంలో అండర్​గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.98 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కోరారు. ఈమేరకు ఆదివారం జిల్లాకు వచ్చిన కిషన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరైందని.. పట్టణాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి డెవలప్ చేయాలని కోరారు. అంతకుముందు శాలువాతో కేంద్ర మంత్రిని సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున తదితరులున్నారు.

ఆలయాన్ని అభివృద్ధి చేయాలి..
స్టేషన్​ఘన్​పూర్(చిల్పూరు): జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్ లోని పురాతన సీతారామచంద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ నాయకులు కోరారు. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు బొజ్జపల్లి సుభాశ్ కిషన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.400 ఏండ్ల కింద కాకతీయులు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరిందని, నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. నష్కల్ లోని రైల్వే అండర్ బ్రిడ్జి 
నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, విచారణ జరిపించాలని కోరారు.

రైతు సమస్యలపై పోరాడాలి

హనుమకొండ సిటీ, వెలుగు: రైతుల సమస్యలపై నిరంతరం పోరాడాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్యాల రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలతో పాటు క్షేత్రస్థాయిలో రైతు సమస్యలపై ధర్నాలు చేయాలన్నారు. అన్ని మండలాల్లో కిసాన్ మోర్చా కమిటీలు వేస్తున్నట్లు వెల్డించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామరెడ్డి, శశికర్ నందా, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీనివాస్ మరణం తీరని లోటు..
హసన్‌‌పర్తి, వెలుగు: బీజేపీ హనుమకొండ జిల్లా కార్యదర్శి గుండమీది శ్రీనివాస్ మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్ ఆధ్వర్యంలో హసన్‌‌పర్తిలోని ఓ ప్రైవేట్ గార్డెన్ లో శ్రీనివాస్​సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, డిస్ట్రిక్ట్​ఆత్మ చైర్మన్ కందుకూరి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే శ్రీనివాస్ మృతి బాధాకరమన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
 

కొత్తగూడలో లంపీ వైరస్ కలకలం

కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో లంపీ వైరస్ పశువుల ప్రాణాలు తీస్తోంది. కొద్దిరోజులుగా గ్రామాలకు పాకిన ఈ వైరస్ నాలుగు జీవాలను చంపేసింది. రైతులు 1062 నంబర్​కు కాల్​చేసినా ఆఫీసర్లు స్పందించడం లేదు. తాజాగా ఆదివారం మండలంలోని చింతగట్టు తండాలో రైతు బోడ దరియాకు చెందిన ఎద్దు లంపీ వైరస్​తో చనిపోయింది. పశువైద్యాధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మండలంలోని కిష్టాపురం, పోలారం, కొత్తపల్లి, చింతగట్టు తండా, ముష్మి, గాంధీనగర్ గ్రామాల్లోనూ ఈ వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి, స్పెషల్ క్యాంప్ నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.

పేద పిల్లల నుంచి లేట్ ఫైన్లు!
మరిపెడ, వెలుగు: దసరా సెలవుల తర్వాత ఆలస్యంగా వచ్చిన పేద విద్యార్థుల నుంచి గురుకులాల సిబ్బంది లేట్ ఫైన్లు వసూలు చేస్తున్నారు. క్రమశిక్షణ చర్యల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. ఒక్క మహబూబాబాద్ జిల్లా మరిపెడ సోషల్ వెల్ఫేర్ లోనే రూ.40వేల నుంచి రూ.50వేల వరకు ఫైన్లు వసూలు చేసినట్లు సమాచారం. కార్పొరేట్ లో చదివించలేకనే, ఇంటి దూరంగా గురుకులాల్లో జాయిన్ చేయిస్తే.. ఫైన్ల పేరుతో వేధించడం సరికాదని పేరెంట్స్ వాపోతున్నారు. దీనిపై ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. లేట్ గా వస్తే ఫైన్లు కట్టాల్సిందేనని చెప్పడం గమనార్హం.

కాలనీలు చెత్తమయం!

కాశిబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ వరంగల్ లోని పలు కాలనీల్లో ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. అవార్డులు, రివార్డులు అంటూ కాలక్షేపం చేసే ఆఫీసర్లు.. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించడం లేదని జనం మండిపడుతున్నారు. శానిటేషన్​ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆఫీసర్లు సైతం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. పలుమార్లు బల్దియా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదన్నారు.

కరెంట్ లేకున్నా తిరుగుతున్న మీటర్!
చిట్యాల, వెలుగు: ఓ వినియోగదారుడికి  విద్యుత్ మీటర్ చుక్కలు చూపిస్తోంది.. ఆఫీసర్ల తప్పిదమో.. మీటర్ ప్రాబ్లమో తెలియదు కానీ, కరెంట్​లేకున్నా మీటర్​ రన్ అవుతోంది. వేలల్లో బిల్లు రావడంతో కంగుతిన్న బాధితుడు కరెంట్ ఆఫీసర్లను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడల్ పేటకు చెందిన గుడి రాజిరెడ్డికి ప్రతి నెలా సగటున రూ.190 బిల్లు వచ్చేదు. కొద్ది నెలలుగా ఆ బిల్లు పెరుగుతూ.. నెలకు రూ.3,400 దాకా చేరింది. దీంతో అవాక్కయిన రాజిరెడ్డి.. కరెంట్ సప్లై నిలిపివేశాడు. అయినా మీటర్ తిరగడంతో ఆఫీసర్లను ఆశ్రయించాడు.
 

ధర్మకర్తల మండలి చైర్మన్ గా నవీన్
కాజీపేట, వెలుగు: కాజీపేట మండలం మడికొండలోని మెట్టుగుట్ట శివాలయ ధర్మకర్తల మండలిని ఆదివారం ఎన్నుకున్నారు. మండలి చైర్మన్ గా దువ్వ నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేశ్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. శివకేశవులు కొలువుదీరిన చారిత్రక మెట్టుగుట్ట ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. మండలిసభ్యులుగా నార్లగిరి కుమారస్వామి, చింతగుంట్ల భూపాల్ రెడ్డి, బుర్ర సంధ్యారాణి, ఓర్సు రాజు, పెద్ది ప్రభాకర్ తదితరులు నియామకమయ్యారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు ఎక్స్ అఫీషియో మెంబర్ రాగిచెడు అభిలాష శర్మ, ఈవో శేషు భారతి, స్థానిక కార్పొరేటర్లు మునిగాల సరోజన కరుణాకర్, ఆవాల రాధిక నరోత్తం రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్ రావు తదితరులున్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించాలి
తొర్రూరు, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక ఆకాంక్షించారు. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన ‘లిటిల్ లీడర్.. లిటిల్ టీచర్’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 38 స్కూళ్లకు చెందిన 267 టెన్త్ క్లాస్ స్టూడెంట్లను ఎంపిక చేయగా.. వీరికి తొర్రూరులో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆదివారం కలెక్టర్ ట్రైనింగ్ క్యాంప్ స్టూడెంట్లకు సూచనలు, సలహాలు చేశారు. ఎంపిక చేసిన స్టూడెంట్లు విషయ పరిజ్ఞానం పెంచుకుని, వెనుకంజలో ఉన్న తోటి విద్యార్థులకు తెలపాలన్నారు. ఈ కార్యక్రమం వల్ల అందరూ ఉత్తీర్ణులు అవ్వడమే కాకుండా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్, ఆర్డీవో రమేశ్, క్వాలిటీ కంట్రోల్ కోఆర్డినేటర్ బుచ్చయ్య,  ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఉన్నారు.