
హనుమకొండ/ కాశీబుగ్గ, వెలుగు: ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆదివారం ఆయన బల్దియా మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీశ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్బాచ్పాయ్తో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలు పోలియో బారినపడకుండా పోలియో చుక్కలు వేయించాలన్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 472 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామని, సోమ, మంగళవారాల్లో ఆరోగ్య సిబ్బంది, అంగన్ వాడీ కార్యకర్తలు, వలంటీర్లు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. అనంతరం జీఎంహెచ్ లోని వార్డులను కలెక్టర్ సందర్శించి, బాలింతలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం హనుమకొండ డీఎంహెచ్వో అప్పయ్య మాట్లాడుతూ 98.7 శాతం పోలీయో చుక్కలు వేశామని, 84,301 మంది పిల్లలకు 83,282 మందికి డ్రాప్స్ వేసినట్టు వివరించారు.
వరంగల్లో 97 శాతం పోలియో చుక్కలు వేశామని, జిల్లా వ్యాప్తంగా 20, 101 మంది పిల్లలకు 19,546 మందికి పోలియో వ్యాక్సిన్ వేసినట్టు డీఎంహెచ్వో సాంబశివరావు తెలిపారు. మిగతా వారి ఇండ్లకు వెళ్లి పోలియో డ్రాప్స్ వేస్తామని చెప్పారు.