ఘోష్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ పై ..బీఆర్ఎస్ పిచ్చివాగుడు : ఎమ్మెల్యే హరీశ్ బాబు

ఘోష్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ పై ..బీఆర్ఎస్ పిచ్చివాగుడు : ఎమ్మెల్యే హరీశ్ బాబు
  • ఎమ్మెల్యే హరీశ్ బాబు విమర్శ

హైదరాబాద్, వెలుగు: పీసీ ఘోష్, ఎన్డీఎస్ఏ రిపోర్టులపై బీఆర్ఎస్ పిచ్చి వాగుడు వాగుతుందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు విమర్శించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు సభలో చిల్లరగా వ్యవహరించారని, కేటీఆర్, హరీశ్ రావు తీరు ప్రజలు ఛీదరించుకునేలా ఉందని తెలిపారు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం విచారణను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం అవినీతి సొమ్ము దేశాలు దాటిందని, దీనిపై పక్షపాతం లేకుండా విచారణ జరగాలంటే సీబీఐ ఎంక్వైరీనే కరెక్ట్ అని ఆయన పేర్కొన్నారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే కాళేశ్వరం కేసును సీబీఐకి  అప్పగించి ఉంటే ఈపాటికి వాస్తవాలు బయటికి వచ్చేవని వివరించారు. ఇప్పటికైనా సీబీఐకి  ఇచ్చినందుకు కాంగ్రెస్ కు హరీశ్ బాబు ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎవరు మాట్లాడినా.. వాళ్లు కాంగ్రెస్ నేతలు అయిపోతారా? అని ప్రశ్నించారు. బీజేపీ, -కాంగ్రెస్ కలిసి సీబీఐ విచారణకు ఇచ్చాయని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని వెల్లడించారు.