ఆంధ్రలో ఓటు వేసి ఇక్కడి ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తరు? : సుదర్శన్ రెడ్డి

ఆంధ్రలో ఓటు వేసి ఇక్కడి ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తరు? : సుదర్శన్ రెడ్డి

రాజన్న రాజ్యంకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం నడిచిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. TRS కార్యకర్తల దాడిలో దెబ్బలు తగిలినట్లు వైఎస్ షర్మిల డ్రామా ఆడారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్  పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. బీజేపీ తెచ్చే రైతు వ్యతిరేక విధానాలపై షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. 

కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎవరైనా పాదయాత్ర చేయొచ్చని ..ఏదైనా ఘర్షణలు జరిగితే వైఎస్ షర్మిలనే బాధ్యత వహించాలని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే పాదయాత్ర ఉద్దేశమని.. అది మర్చిపోయి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. “ఇక్కడ వైఎస్ షర్మిల తెలంగాణ బిడ్డ అని చెబుతున్నారు. ఆమె అన్న  వైఎస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉన్నారు. షర్మిల గత ఎన్నికల్లో ఎక్కడ ప్రచారం చేశారు? ఆమె ఉమ్మడి కడప జిల్లా పులివెందులలో ఓటు వేసి ఎవరిని ప్రశ్నించారు. ఆంధ్రాలో ఓటు వేసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తారు”అని  నిలదీశారు. 

తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిదేండ్లు అవుతుంటే తెలంగాణ బిడ్డ అనే విషయం షర్మిలకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆమె రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. పాకాల రంగయ్య పల్లి ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ  రాశారని... దాన్ని బలపరుస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా లేఖ రాశారనే విషయాన్ని గుర్తుచేశారు.