
- బీఆర్ఎస్ రైతు రాస్తారోకోలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
దుబ్బాక, వెలుగు: రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం అక్భర్పేట, భూంపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై నిర్వహించిన బీఆర్ఎస్ రాస్తారోకోలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో రాని యూరియా కొరత ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. యూరియా కొరత బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల చేతగాని తనమేనని ఎద్దేవా చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి రైతులు, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట: యూరియా కొరతను తీర్చి రైతులకు అవసరమైన విధంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో కార్యక్రమానికి తరలివచ్చారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బీఆర్ఎస్నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్న చూపు చూస్తూ వారి సమస్యలను పట్టించుకోవడం లేదని మండి పడ్డారు.
చేగుంట: చేగుంట మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద మంగళవారం తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. ఆగ్రోస్ సేవా కేంద్రానికి 400 బస్తాలు యూరియా రావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూ లైన్ లో నిల్చున్నారు. 15 రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేగుంటకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి ఎదురవుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. చేగుంట మండలానికి ఐదు లారీల యూరియా అవసరముంటే 300 బస్తాల యూరియా మాత్రమే వచ్చిందన్నారు.
కోహెడ (హుస్నాబాద్): అక్కన్నపేట మండల కేంద్రంలో ఆగ్రో రైతు సేవా కేంద్రానికి యూరియా లోడ్ వచ్చిందనే సమాచారంతో రైతులు పట్ట పాస్ బుక్ జిరాక్స్ కాపీలతో క్యూ కట్టారు. షాపు యజమాని ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున టోకెన్లు ఇచ్చి బుధవారం ఇస్తామని చెప్పారు.