- మంచిర్యాల జిల్లా గూడెం స్కూల్ విద్యార్థులకు బ్యాగులు పంపిణీ
- స్టూడెంట్లతో కలిసి భోజనం చేసిన ఎంపీ
- త్వరలో స్కూల్‌కు బెంచీలు అందిస్తానని హామీ
దండేపల్లి/ పెద్దపల్లి/గోదావరిఖని, వెలుగు: విద్యాభివృద్ధికి విశాక ట్రస్ట్ చేయూత అందిస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్పారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎంపీ మాట్లాడుతూ.. అంబేద్కర్ స్ఫూర్తితో కాకా వెంకటస్వామి విశాక ఛారిటబుల్ ట్రస్ట్‌ను నెలకొల్పి, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గూడెం స్కూల్ విద్యార్థులకు బ్యాగులు అందజేశామని ఎంపీ చెప్పారు. త్వరలోనే స్కూల్‌కు బెంచీలు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ లీడర్ సునీల్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ రాజేందర్, పెద్దపేట సర్పంచ్ సత్తయ్య, తాళ్లపేట ఉప సర్పంచ్ తిరుపతి, సత్యంరావు పాల్గొన్నారు.
రాజకీయాలకతీతంగా అభివృద్ధికి కృషి
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎంపీ వంశీకృష్ణ చెప్పారు. రాజకీయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో గూడెం ఆలయ పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క, మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఇప్పుడు విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేయడానికి వస్తే అడ్డుకోవాలని రచ్చ చేయడం సరికాదన్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
రెచ్చిపోయిన పీఎస్సార్ అనుచరులు
ఎంపీ వంశీకృష్ణ పర్యటన సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు రెచ్చిపోయారు. మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన ఎంపీ ఫ్లెక్సీలను చింపివేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా, ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా ఎంపీ ఎలా వస్తారంటూ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో గూడెం చెక్‌పోస్ట్ వద్ద నాలుగు గంటలు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే వర్గీయులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకువెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎంత సముదాయించినా వినకుండా వారితో గొడవకు దిగారు. ఆర్టీఐ సభ్యుడు అంకతి శ్రీనివాస్ ఎంపీ వాహనానికి ఎదురెళ్లి కార్ బ్యానెట్‌పై కొట్టగా.. డీసీపీ, ఏసీపీలు పక్కకు నెట్టివేయడంతో కాన్వాయ్ వెళ్లిపోయింది. విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేయడానికి వచ్చిన ఎంపీని అడ్డుకోవడం ఏమిటని స్థానికులు విమర్శించారు.
సాత్విక్ కుటుంబానికి అండగా ఉంటా
రామగుండం మండలం ఖాజీపల్లిలోని ప్రభుత్వ స్కూల్ పక్కన ఉన్న బావిలో పడి చనిపోయిన సాత్విక్ కుటుంబాన్ని ఎంపీ వంశీకృష్ణ పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్త పాలకుర్తి చిన్న రాజేశం గౌడ్, అమరగోని అంజయ్య గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు బొమ్మగాని తిరుపతి గౌడ్ ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇటీవల మృతి చెందిన పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు.
తెలంగాణ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటా
తెలంగాణ హక్కుల కోసం నిరంతరం పార్లమెంట్ లో పోరాడుతూనే ఉంటానని పెద్దపల్లి ఎంపీ వంశీ చెప్పారు. ధర్మారం మండలంలో రూ. 20 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ధర్మపురి -కోటిలింగాల ఆలయాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. అయోధ్య రామాలయ నిర్మాణంలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయన్నారు. పార్లమెంట్‌లో మెజార్టీ కోసం ఇతర పార్టీల ఎంపీలను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్ష లీడర్లను బెదిరించేందుకు సీబీఐ, ఈడీ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్ర హక్కులు, అభివృద్ధి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.గోదావరిఖనిలో లయన్స్క్లబ్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కళావతి, సెక్రటరీ జయప్రద, ప్రతినిధులు మల్లికార్జున్, రాజేందర్‌ను అభినందించారు.
