
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ‘‘సిట్ దర్యాప్తు మొదలై నెల దాటింది. మెటీరియల్‌ను పోలీసులు సీజ్ చేశారు. నెల కంటే ఎక్కువ రోజులు నిందితులు జైలులో ఉన్నారు. ఒకవేళ నిందితులు కొత్త నేరాలకు పాల్పడితే పోలీసులు కేసు నమోదు చేయవచ్చు. నిందితులు బెయిల్ పొందేందుకు అర్హులు’’ అని చెప్పింది.
రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి వేర్వేరుగా దాఖలు చేసుకున్న పిటిషన్లపై గురువారం జస్టిస్ చిల్లకూరు సుమలత విచారణ జరిపారు. ఒక్కొక్కరు రూ.3 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని.. అంతే మొత్తానికి రెండు షూరిటీలు సమర్పించాలని స్పష్టం చేశారు. పాస్‌పోర్టులను పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని.. ఇవ్వకుంటే వాటిని పోలీసులు సీజ్ చేయాలని సూచించారు. నిందితులు దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. సిట్ చార్జిషీట్ దాఖలు చేసేవరకు ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల మధ్య సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని.. కేసు దర్యాప్తునకు సహకరించాలని సూచించింది. కేసుతో సంబంధం ఉన్న వారిని ప్రలోభపెట్టకూడదని, బెదిరించకూడదని పేర్కొంది.
పోలీసులకు నిందితులు సహకరించారు: పిటిషనర్ లాయర్
ఏ2 రామచంద్ర భారతి తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. ముగ్గురికీ సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వలేదని, దీన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిందని, నిందితులు దాఖలు చేసిన మరో పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన అబ్జర్వేషన్స్‌ను తీవ్రంగా పరిగణించాలని కోరారు. నిందితులకు బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీం చెప్పిందని గుర్తు చేశారు. విచారణకు ఆటంకం కలిగించే వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులకు అన్ని అధికారాలు ఉంటాయని, అయితే ఇక్కడి కేసులో నిందితులు పూర్తిగా సహకరించారని తెలిపారు. నెల రోజులుగా జైల్లో ఉన్న నిందితులకు బెయిల్ ఇవ్వాలని కోరారు.
సాక్ష్యాధారాలను తారుమారు చేస్తరు: సిట్
సిట్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టీవీ రమణారావు వాదిస్తూ.. ముగ్గురు నిందితులు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారని, బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని చెప్పారు. సిట్ దర్యాప్తు లోతుగా చేస్తున్నదని, ఈ దశలో బెయిల్ ఇవ్వొద్దని కోరారు. నిందితుల వద్ద పలు ఆధార్ కార్డులు, పాస్‌పోర్టులు ఉన్నందున పారిపోయే అవకాశాలు ఉంటాయన్నారు. ఒక పాస్‌పోర్టు స్వాధీనం చేసినా మరో పాస్ పోర్టుతో విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయని తెలిపారు. నిందితులకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రూ.250 కోట్లు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారని చెప్పారు. రామచంద్ర భారతిపై రెండు కేసులు, నందకుమార్‌పై పది కేసులు ఉన్నాయని వాళ్లే అంగీకరించారని వివరించారు.
ఏం జరిగిందంటే..
అక్టోబర్ 26న మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నించారని పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా.. వారికి సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని కోర్టు తప్పుపట్టింది. రిమాండ్‌కు పంపేందుకు నిరాకరించింది. దీంతో హైకోర్టును సిట్ ఆశ్రయించింది. నిందితులు లొంగిపోవాలని లేకపోతే వాళ్లను పోలీసులు అరెస్టు చేసి కింది కోర్టులో హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు వాళ్లను రిమాండ్‌కు తరలించింది. రెండు రోజులు పోలీసుల కస్టడీకి కూడా ఇచ్చింది. వాళ్ల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టేయడంతో ఇప్పడు హైకోర్టు ద్వారా బెయిల్ పొందారు.