బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక దాడులు చేస్తున్నారు : రఘునందన్ రావు

బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక దాడులు చేస్తున్నారు : రఘునందన్ రావు

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  దుబ్బాక బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ పెద్ది నవీన్ ను ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర ఆరోపణలు చేశారు. సూరంపల్లిలో జరిగిన సంఘటనల తర్వాత బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. 

సోషల్ మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా కేసులు పెట్టవద్దని సుప్రీంకోర్టు చెప్పినా పోలీసులు మాత్రం కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. సిద్దిపేట పోలీసులు కేవలం బీజేపీ నేతల ఇండ్లకు వెళ్లి.. తమ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తనను, బీజేపీ పార్టీని ఎదుర్కొనే సత్తా లేక ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి బంద్ కు సిద్దిపేట సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై మంగళవారం (అక్టోబర్ 31వ తేదీ) ఉదయం వరకు వేచి చూసి... ఆ తర్వాత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. 

బీజేపీ కార్యకర్తలెవరూ హింసకు పాల్పడవద్దని, అది తమ సిద్దాంతం కాదని సూచించారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన వ్యక్తి ఏ పార్టీకి చెందిన వాడో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట పోలీసులతో శాంతి భద్రతలు అదుపులో లేకపోతే... కేంద్ర బలగాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామన్నారు.