ఎమ్మెల్యే విద్యాసాగర్ వెంటనే క్షమాపణ చెప్పాలి

ఎమ్మెల్యే విద్యాసాగర్ వెంటనే క్షమాపణ చెప్పాలి

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన కామెంట్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచందర్రావు సీరియస్ అయ్యారు. రామమందిరానికి చందాలివ్వొద్దని TRS ఎమ్మెల్యే చెప్పడం సిగ్గుచేటన్నారు. వెంటనే ప్రజలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలన్నారు. రామాలయం నిర్మాణ నిధి చందా కోసం బీజేపీ ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదన్నారు రాజాసింగ్, రామచందర్రావు.

అయోధ్యలో రామాలయం నిర్మాణం ప్రతి హిందువు కల అని..రామ మందిరాన్ని కట్టేందుకు అనేక మంది ముందుకు వచ్చారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రతి హిందువును భాగస్వామ్యం చేయాలనే నిధి సేకరిస్తున్నామన్నారు. బొట్టు పెడితేనే హిందువా ? బీజేపీ వాళ్ళు కలెక్షన్లు చేస్తున్నారు.. ఒక్క రూపాయి ఇవ్వవద్దు అని టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పడం సిగ్గు చేటు అన్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఫైర్ అయ్యారు.  విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత వ్యాఖ్యలా…? టీఆర్ఎస్ పార్టీదా ? స్పష్టం చేయాలన్నారు. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇస్తుంటే ఈయనకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే విరాళాలు సేకరిస్తున్నారని..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. వెంటనే కోరుట్ల ఎమ్మెల్యే హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాసాగర్ కామెంట్స్ దేశ వ్యతిరేఖ వ్యాఖ్యలుగా భావించాల్సి వస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు.