మంత్రుల నియోజకవర్గాలకే బిల్లులా?... అన్ని నియోజక వర్గాలను సమానంగా చూడాలి : ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి

మంత్రుల నియోజకవర్గాలకే బిల్లులా?... అన్ని నియోజక వర్గాలను సమానంగా చూడాలి :  ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి
  •     అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని, మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఆరోపించారు. నిధుల కోసం మంత్రులు, సీఎం చుట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, ప్రభుత్వం ఏం చేసినా.. ఎన్ని నిధులు ఇచ్చినా ఆ జిల్లాకే వెళ్తున్నాయని బయట టాక్ ఉందన్నారు. 

సీఎం తన సొంత నియోజకవర్గం కొడంగల్ ను అభివృద్ధి చేసుకున్నట్లు.. మునుగోడును చేసుకోవాలని తనకు ఉండదా అని పేర్కొన్నారు. మధిర, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ నియోజకవర్గాలకే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు తరలిస్తున్నారని విమర్శించారు. అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలని హితవు పలికారు.  

బీఆర్ఎస్​ అప్పులపాలు చేసింది

ఇరిగేషన్​ప్రాజెక్టులు, రీడిజైన్ పేరుతో గత బీఆర్ఎస్​ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి ఆరోపించారు. ప్రాణహిత-–చేవెళ్ల ప్రాజెక్టును మేడిగడ్డ బ్యారేజీగా మార్చడం తప్పిదమని, ఇది ప్రభుత్వానికి ముళ్ల కిరీటంగా మారిందన్నారు. దిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడెం రిజర్వాయర్ ను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగిందని,  నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రణాళికలతో 4 లక్షల ఎకరాలకు నీరందించే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.

ప్రభుత్వ స్కూళ్లలో వసతులు లేవు 

గత ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని, కొన్ని పాఠశాలల్లో ఎక్కువ మంది టీచర్లు, మరికొన్ని స్కూళ్లలో ఒక్కొక్కరు చొప్పున టీచర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచినా ఆహార నాణ్యతలో మార్పు లేదన్నారు. విద్యకు బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని కోరారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తుండటం హర్షణీయమన్నారు.