
- గత బీఆర్ఎస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలే కారణం
- ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శలు
చండూరు, (మర్రిగూడ)వెలుగు: మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం శివన్న గూడెం రిజర్వాయర్‌ని నిర్మిస్తున్నప్పటికీ అందులోకి ఎక్కడి నుంచి నీటిని తరలించాలని ఆలోచన లేకుండా ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ చేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రిజర్వాయర్ పనులపై సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
శివన్న గూడెం రిజర్వాయర్ పనులు 80 శాతం పూర్తయినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ పనులు మొదలు కాలేదన్నారు. వెంటనే డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ పై సర్వే చేసి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించి మహబూబ్ నగర్ జిల్లాలోని ఎదుల్ల రిజర్వాయర్ నుంచి శివన్నగూడ రిజర్వాయర్ కు నీటిని తరలించేలా రూ. 1800 కోట్లతో పరిపాలన అనుమతులు తీసుకొచ్చామన్నారు.
శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి తాగునీరు అందించడానికి సుమారు రూ. 1200 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. సమావేశంలో ఎస్ ఈ.శ్రీనివాసరెడ్డి, మర్రిగూడెం ఈఈ రాములు, చండూరు డీఈ కాశీంలతో పాటు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సభ్యులు శ్యాం ప్రసాద్ రెడ్డి, సత్తిరెడ్డి ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.