టీఆర్​ఎస్​ సభ్యత్వం ఉన్నోళ్లకే సంక్షేమ పథకాలు

టీఆర్​ఎస్​ సభ్యత్వం ఉన్నోళ్లకే సంక్షేమ పథకాలు

స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలు

జనగామ, వెలుగు: టీఆర్​ఎస్​ సభ్యత్వం ఉన్నోళ్లకే  సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, విధిగా పార్టీ సభ్యత్వం ఉండాల్సిందేనని స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో ఎలక్షన్ల వరకే రాజకీయాలు.. తర్వాత అందరికీ సంక్షేమ పథకాలు అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కాదు.. తనకు లేని ధర్మం లేదు.. ఇప్పటినుంచి రాబోయే మూడేండ్లలో టీఆర్​ఎస్​ సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు” అని చెప్పారు. టీఆర్​ఎస్​ సభ్యత్వ నమోదులో భాగంగా ఆయన శనివారం తన నియోజకవర్గంలోని చిల్పూరు మండలం రాజవరం, నునావత్​ తండాలో మాట్లాడారు. పార్టీ శ్రేణులను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో టీఆర్​ఎస్​ సభ్యత్వం ఉన్న కుటుంబ సభ్యుల్లో అర్హులకు మాత్రమే పెన్షన్లు, రేషన్​కార్డులు, డబుల్​ బెడ్​ రూం ఇండ్లు తదితర పథకాలను అమలు చేస్తామన్నారు. పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని తేల్చిచెప్పారు. సభ్యత్వాల పెంపు కోసం తన సొంత హాస్పిటల్​లో మెడికల్​ రాయితీలు ఇస్తామని, హెల్త్​ కార్డులు జారీ చేస్తామని, దీనికి సంబంధించి తన పుట్టిన రోజైన మార్చి 2న  ప్రకటన చేస్తానని పేర్కొన్నారు. నునావత్​ తండాలో ఇండ్ల స్థలాలు ఉన్న అర్హులందరికీ వారి స్థలాల్లోనే డబుల్​ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూ. 6 లక్షల చొప్పున అందిస్తామన్నారు. ఇటీవల జనగామలో జరిగిన టీఆర్​ఎస్​ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా పార్టీ కార్యకర్తలు చెప్పినోళ్లకే పథకాలని, కండువా కప్పుకున్నోళ్లకే   డబుల్​ బెడ్రూం ఇండ్లని అన్నారు.