హరీష్ రావు ఒక్కసారైనా హిందూవాహినిలో పనిచేయాలి : రాజాసింగ్

హరీష్ రావు ఒక్కసారైనా హిందూవాహినిలో పనిచేయాలి : రాజాసింగ్

సిద్దిపేట నగరంలో బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పర్యటించారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గా మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు రాజా సింగ్.

హిందూ రాష్ట్రం ఏర్పాటు చేయడమే హిందూ వాహిని లక్ష్యం అని చెప్పారు రాజాసింగ్. గో హత్యలు, లవ్ జిహాద్,  మత మార్పిడి లాంటి వాటిని నిరోధించడానికి హిందూ వాహిని పనిచేస్తుందని అన్నారు. దేవినవరాత్రులు నిర్వహించే ప్రతి మండపం దగ్గర హిందూ వాహిని కార్యకర్తలు సనాతన ధర్మం గురించి,  మన సంస్కృతి గురించి తెలియజేయాలని కోరారు.

అందరినీ ఆదరించే హరీష్ రావు హిందూవాహిని పట్ల వివక్ష ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు రాజాసింగ్. హిందూ వాహిని అంటే ఏంటో తెలియాలంటే హరీష్ రావు ఒకసారి ఈ సంస్థలో పని చేయాలని కోరారు. హిందూ వాహిని కార్యకర్తలు ఏ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా పోలీసులు కార్యకర్తలను బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని సూచించారు. ఇది చిన్న సంస్థ కాదనీ… పెద్ద శక్తి అనీ.. ఆ శక్తితో ఎవరు పెట్టుకున్నా వారి గతి ఏమవుతుందో ఇక్కడి అధికారులకు, నాయకులకు అర్థమయ్యేలా బుద్ధిచెబుతామని చెప్పారు రాజాసింగ్.

“నేను ఎమ్మెల్యే కాకముందు హిందూ వాహిని కార్యకర్తను. యువకులు దేశ రక్షణ, ధర్మరక్షణ కోసం హిందూ వాహినిలో పని చేయాలని పిలుపునిస్తున్నా” అన్నారు రాజాసింగ్.