వచ్చే అసెంబ్లీలో నేను ఉండకపోవచ్చు..నా నియోజకవర్గాన్ని మీరే అభివృద్ధి చేయాలి

వచ్చే అసెంబ్లీలో నేను ఉండకపోవచ్చు..నా నియోజకవర్గాన్ని మీరే అభివృద్ధి చేయాలి

రాష్ట్ర అసెంబ్లీలో గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఉండకపోవచ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో గోషామహల్ నుంచి ఎవరు గెలుస్తారో తెలియదన్నారు. తాను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉందన్నారు. సొంత వారు, బయటి వారు తనను అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అసెంబ్లీలో అడుగు పెట్టొద్దని తన చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజాసింగ్ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గోషామహల్ లో  పర్యటిస్తానని.. అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పి మాట తప్పారని రాజాసింగ్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గాన్ని విస్మరించడం బాధాకరంగా ఉందన్నారు.  అసెంబ్లీలో తానున్నా లేకున్నా గోషా మహల్ ను  అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ ను కోరారు.

మ‌హ్మద్ ప్రవ‌క్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను బీజేఎల్పీ నేత రాజాసింగ్‌పై 2022 ఆగస్టు 23న బీజేపీ సస్పెండ్ చేసింది. పార్టీ విధానాల‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చ‌ర్యలు తీసుకుంది.  శాస‌న స‌భాప‌క్ష నేత ప‌ద‌వినుంచి కూడా తొల‌గించింది.  అప్పటి నుంచి రాజాసింగ్ బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.