గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను శంషాబాద్ విమానాశ్రంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్‍లో ఇటీవల గో హత్య కారణంగా జరిగిన అల్లర్లలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ మెదక్ వెళ్తారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆయన్ని ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుండి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న రాజాసింగ్ ను ఆర్జిఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు ఎస్కార్ట్ తో రాజాసింగ్ ని పోలీసులు ఆయన ఇంటికి తరలించనున్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించిన రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదం కాస్తా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసి.. భౌతిక దాడులకు పాల్పడే స్థాయికి చేరింది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ వివాదం నేపథ్యంలో బీజేపీ నేతలు మెదక్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఘర్షణలు చెలరేగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘర్షణలను ప్రోత్సహిత్సే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఐజీ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు.