బాసర ట్రీపుల్​ ఐటీని ప్రక్షాళన చేయండి : రామారావు పటేల్

బాసర ట్రీపుల్​ ఐటీని ప్రక్షాళన చేయండి : రామారావు పటేల్
  • వర్సిటీలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టండి
  • పలు అంశాలపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే పటేల్​

భైంసా, వెలుగు: ఎమ్మెల్యే రామారావు పటేల్​మొట్టమొదటిసారి గురువారం అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. అవినీతిని దుయ్యబట్టారు. ప్రతిష్ఠాత్మక బాసర ట్రిపుల్​ఐటీకి అవినీతి చెదలు పట్టిందని, అక్రమాలకు పాల్పడుతున్న వీసీని తొలగించాలన్నారు. 9వేల మంది విద్యార్థులున్న ట్రీపుల్​ ఐటీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని, డైరెక్టర్​కు ఎలాంటి అధికారాలు ఇవ్వకపోవడంతో పాలన కుంటుపడిందన్నారు.

18 నెలలుగా వీసీ పర్యవేక్షణ లేదన్నారు. హాస్టల్​లోని​ ఒక్కో రూంలో ముగ్గురు బాలికలు ఉండడం వల్ల వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. యూనివర్సిటీలో గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. హాస్టల్​లో బాత్రూం​లు సరిగ్గా లేవని, భోజన వ్యవస్థ అధ్వానంగా ఉందన్నారు. గత ప్రభుత్వం బాసర ఆలయ పునర్నిర్మాణానికి రూ.50 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి రూ.42 కోట్లను వెనక్కి తీసుకున్నారని, ఆ నిధులను తక్షణమే మంజూరు చేసి ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలన్నారు.

పల్సికర్​ రంగారావు ప్రాజెక్టు మూలంగా గుండెగాం వాసులు ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్నారని, పునరావాసం కిందగత ప్రభుత్వం రూ.90 కోట్లు ప్రకటించి ఇప్పటివరకు బాధితులకు ఇవ్వలేదన్నారు. తానూర్ మండలంలో వడగళ్ల వానతో వెయ్యికి పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సర్వే చేయించి రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు.