ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే రాందాస్ నాయక్
  • ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 

కారేపల్లి, వెలుగు : దసరా పండుగ సందర్భంగా వైభవంగా నిర్వహించనున్న కోట మైసమ్మ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని  వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. మండలంలోని  ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ ఆలయం ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో ఆదివారం ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ మీటింగ్ లో ఎమ్మెల్యే మాట్లాడారు. దసరా రోజు నుంచి ఐదు రోజులపాటు రాత్రింబవళ్లు నడిచే ఈ జాతర ను అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. భక్తులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసు అధికారులు ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. 

దేవాదాయ శాఖ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాని కంటే ముందు ఎమ్మెల్యే కోట మైసమ్మ తల్లిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఆలయ ధర్మకర్త డాక్టర్ పర్సా పట్టాభిరామారావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో శ్రీనివాసరావు, సీఐ తిరుపతి రెడ్డి, ఎస్సై గోపి, దేవాదాయ శాఖ ఈవో వేణుగోపాలచార్యులు, కాంగ్రెస్ నాయకులు పగడాల మంజుల, తలారి చంద్రప్రకాశ్, బానోతు రామ్మూర్తి, అడ్డగోడ ఐలయ్య, మేదరి టోనీ, భీముడు, హీరాలాల్, మేదరి రాజా, భద్రు నాయక్, గడ్డం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.