
సోషల్ మీడియా పోస్టింగ్ లపై ఆగ్రహం
సిద్దిపేట, వెలుగు: సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడనే కారణంతో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జిపై బూతులతో విరుచుకుపడ్డారు. ఈ ఫోన్ రికార్డింగ్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన పోతిరెడ్డి రాజశేఖరరెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తూ, కరీంనగర్ పార్లమెంట్నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆయన మండలం, గ్రామంలోని సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతుంటారు.
బెజ్జంకి మండలాన్ని కరీంనగర్లో కొనసాగించాలని, బేగంపేటను మండల కేంద్రంగా చేయాలని, ఇతరత్రా పలు సమస్యలపై ఇటీవల ఫేస్బుక్లో పోస్ట్‌లు పెట్టారు. ఈ పోస్టింగ్‌లపై ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కామెంట్స్రావడం రసమయికి ఆగ్రహం తెప్పించింది. దీంతో శనివారం బాలకిషన్, పోతిరెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్‌చేశారు. దాదాపు మూడు నిమిషాలపాటు సాగిన ఈ సంభాషణలో రసమయి, రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరమైన పదజాలం వాడడం వివాదాస్పదమైంది. కాగా, ఎమ్మెల్యే తీరును కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు.