
నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జూకల్ శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్ ను ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. స్కూల్లో గదులు కలియతిరుగుతూ విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే తమకు ఎలర్జీ, సీజనల్ వ్యాధులు వస్తున్నాయని పిల్లలు ఆరోపించారు. మెను ప్రకారం భోజనం పెట్టడంలేదని, కరెంట్ స్విచ్‌లు చెడిపోయి షాక్ వస్తున్నాయని, గదుల్లో ట్యూబ్‌లైట్లు వెలగవని, ఫ్యాన్లు తిరగవని వాపోయారు.
దీంతో ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లోంచి తొలగించాలని ఆర్సీవో గౌతంరెడ్డికి సూచించారు. ఆయన విషయాన్ని గురుకులాల కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానన్నారు. వర్గల్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లిన స్వాతిని తిరిగి గురుకులంలో కేటాయించాలని ఆర్సీవోను ఆదేశించారు. సాయంత్రం సబ్కలెక్టర్ఉమాహారతి గురుకులాన్ని సందర్శించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.